లగ్న కారకత్వములు
జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధానమైనది లగ్నం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లు అన్ని భావాల్లోకి లగ్నం ప్రధానమైనది. జాతకునికి సంబంధించిన ఏ అంశాన్ని అయినా లగ్నం, లగ్నాత్తు ఆయా భావాల కలయిక ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. లగ్నం, ఇతర భావాలు, గ్రహస్థితులు, దశాభుక్తులు మొదలైన గణిత విభాగాన్ని మీకు ఇక్కడ అందించటం లేదు దీని కొరకు శ్రీ కె.ఎస్. కృష్ణమూర్తి గారి పుస్తకాలు కాని, లేక బి.వి.రామన్ గారి పుస్తకాలు కాని ఇతర ప్రముఖ జ్యోతిష్కుల పుస్తకాలు కాని చదవ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పాఠాల ద్వార ప్రధానంగా జాతకవిశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వటం వలన గణిత విభాగాన్ని అందించలేక పోతున్నాను. లగ్నం : ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధాన ఆధారం. లగ్నం ఒక వ్యక్తి శారీరక స్థితి ఎలా ఉంటుందో చెపుతుంది. అతని మానసిక స్థితి, ప్రవర్తన, సమాజంతో అతను వ్యవహరించే విధానం , సమాజం పట్ల అతనికున్న దృక్కోణం , అతని అరోగ్య స్థితి, అలోచనా విధానం ఇలా ఒక్కటేమిటి ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల ప్రాథమిక అవగాహన ఒక్క లగ్నం ద్వారా నిరూపితమవుతుంది. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్నం ద్వారా తెలుసుకోదగిన అంశాలను ఈ విధంగా చెప్పాడు. శ్లో।। తనుం రూపంచ జ్ఞానంచ, వర్ణం చైవ బలాబలం । ప్రకృతిం సుఖ దుఃఖంచ, తనుభావద్విచింత్యయేత్ ।। -బృహత్పరాశరి, భావవివేచనాధ్యాయం, 2 వ శ్లోకం. అంటే శరీరము, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావము, సుఖదుఃఖాలు తనుభావమునుంచి తెలుసుకోవాలి. కాళిదాసు తన ఉత్తర కాలామృతములో లగ్నభావకారకత్వాల్ని మరింతనిశితముగా విశ్లేషించాడు.
దేహము, కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనము, జ్ఞానము, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము, తర్వాత జరిగే ఫలితాలు అంటే ఒక కార్యముయొక్క పర్యవసానము ఏ విధముగా ఉంటుందో తెలుసుకోవటము, రాజనీతి, ఆయుర్దాయము, శాంతి, వయస్సు, కేశములు, అభిమానము, జీవనము, అపర విషయములు, జూదము, చిహ్నము, పౌరుషము, చర్మము, నిద్ర, అజ్ఞానము, ధనమును దొంగలించటము, మనుష్యులను తిరస్కరించు స్వభావము, రోగము లేకపోవటము, వైరాగ్యము, ప్రకృతి, కార్యములను చేయటం, జీవకార్యములయందు ప్రయత్నించుట, మర్యాదను పోగొట్టుకొనుట, మొదలైన ఫలితాలను లగ్నము ద్వారా చూడాలి. అంతే కాకుండా ప్రాపంచిక దృష్టి, స్నేహితుల తోబుట్టువులు, శతృవులు, భాగస్వాముల భార్యలు, పనివారల మరణము, ప్రథమ సంతానము యొక్క దూరప్రయాణాలు, వారి భాగ్యము, తోబుట్టువుల స్నేహితులు మొదలైన విషయాలు ఈ లగ్నము ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రథమ భావానికి లగ్న, మూర్తి, అంగ, తను, ఉదయ, వపు, ఆద్య మరియు కల్పమని ఎనిమిది పేర్లు కలవు. దీని అధికారము శిరసుపై ఉంటుంది.
Comments
Post a Comment